- దీపావళి: సాంప్రదాయం మనదైతే .. సంరక్షణ ప్రకృతిదౌతుంది!
- వెలుగుల పండుగ ప్రకృతికి చీకట్లు మిగల్చకూడదు!
- మారాల్సింది, మార్చాల్సింది మనమే – పండుగలు జరుపుకునే సంస్కృతిని కాదు!*
- సంప్రదాయాలకు పర్యావరణ స్పృహను జోడిద్దాం – భావితరాలకు ఆరోగ్యకరమైన పండుగలను అందిద్దాం!
- సేఫ్ దీపావళి – సేవ్ ఎన్విరాన్మెంట్!
దీపావళి అంటే కేవలం వెలుగుల పండుగ కాదు – జీవితాల్లో వెలుగులు నింపే సంస్కృతి!
భారతీయ సంస్కృతిలో దీపావళికి విశిష్టమైన స్థానం ఉంది. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటాం. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఒకచోట చేరడం, ఇళ్లను శుభ్రపరచుకోవడం, దీపాలు వెలిగించడం, మిఠాయిలు పంచుకోవడం వంటి సంప్రదాయాలు మన సామాజిక ఐక్యతకు ప్రతిబింబాలు. పండుగల అసలైన పరమార్థం మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయత, సంతోషం, సామరస్యాన్ని పెంపొందించడం. అయితే మన ఆనందం మరొక జీవికి ఆవేదన కలిగించకూడదు. మన సంబరాలు ప్రకృతికి ప్రమాదంగా మారకూడదు.
*అప్పటి పండుగలు – ప్రకృతితో ముడిపడిన జీవనశైలి!*
గతంలో మన పండుగలకు ప్రకృతితో విడదీయలేని అనుబంధం ఉండేది. ఇంటి ముందు ముగ్గులు, పూల అలంకరణలు, మామిడి తోరణాలు, మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె లేదా ఇతర సహజ నూనెలతో దీపాలు వెలిగించడం వంటి సంప్రదాయాలు పర్యావరణ హితమైన జీవన విధానానికి ఉదాహరణలు. పండుగల సందర్భంగా ఇళ్లను, పరిసరాలను శుభ్రపరచుకోవడం, బంధువులను కలుసుకోవడం, ప్రకృతిలో లభించే వస్తువులతో అలంకరణలు చేసుకోవడం వంటి ఆచారాలు ఉండేవి. పండుగ అంటే ప్రకృతిని ఆస్వాదించడం, సమాజంతో కలిసి జీవించడం, మన సంస్కృతిని తరువాతి తరాలకు అందించడం అనే గొప్ప జీవన తత్వం అందులో దాగి ఉండేది.
*మారుతున్న పండుగ సంస్కృతి – ఆనందం నుంచి ఆడంబరాల వైపు!*
కాలక్రమేణా పండుగలు జరుపుకునే విధానంలో అనేక మార్పులు వచ్చాయి. సంప్రదాయ దీపాల స్థానంలో అధిక విద్యుత్ వినియోగం, సహజ అలంకరణల స్థానంలో ప్లాస్టిక్ అలంకరణలు, కుటుంబ సమ్మేళనాల స్థానంలో ప్రదర్శనాత్మక సంబరాలు, ఆనందానికి ప్రతీకగా ఉండాల్సిన టపాసుల స్థానంలో పోటీగా భారీ శబ్దాలు, పొగలు పెరిగిపోయాయి. పండుగల అసలు ఉద్దేశం క్రమంగా మరుగున పడుతూ, వినియోగ సంస్కృతి (కన్స్యూమరిజం), ఆడంబర ప్రదర్శన (షో-ఆఫ్ కల్చర్), అనవసర వ్యయం పెరుగుతున్నాయి. మనం జరుపుకుంటున్న పండుగ మన సంస్కృతిని ప్రతిబింబిస్తోందా? లేక మన పర్యావరణ బాధ్యతను మరచిపోయేలా చేస్తోందా? అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. దీపావళి పండుగను కేవలం దీపాలు వెలిగించడం, టపాసులు కాల్చడం, ఆనందోత్సాహాలతో జరుపుకోవడం అనే సంప్రదాయానికే పరిమితం చేయకుండా, ప్రకృతి పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణ, పర్యావరణ బాధ్యతతో అనుసంధానిస్తూ ఒక ప్రత్యేకమైన శాస్త్రీయ, సామాజిక సందేశంతో జరుపుకోగలగాలి.
*టపాసుల కాలుష్యం – మన ఆరోగ్యానికి కనిపించని ప్రమాదం!*
దీపావళి సందర్భంగా భారీగా టపాసులు కాల్చడం వల్ల వాతావరణంలో పీఎం.2.5, పీఎం.10 వంటి సూక్ష్మ ధూళి కణాలు, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు తదితర కాలుష్య కారకాలు పెరిగే అవకాశం ఉంది. వీటివల్ల గాలి నాణ్యత దెబ్బతిని శ్వాసకోశ సమస్యలు, కళ్ల మంట, గొంతు ఇబ్బందులు, ఆస్తమా వంటి సమస్యలు తీవ్రతరం కావచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, శ్వాసకోశ సమస్యలున్నవారు ఎక్కువగా ప్రభావితమవుతారు. ఒకరోజు సంబరాల కోసం మనం పీల్చే గాలిని విషపూరితం చేసుకోవడం ఎంతవరకు సమంజసం? స్వచ్ఛమైన గాలి మనకు ప్రకృతి అందించిన జీవనాధారం. దానిని కాపాడుకోవడం మనందరి బాధ్యత.
*టపాసుల కాలుష్యంలో మూడు ప్రధాన కాలుష్యాలు*
దీపావళి పటాకులు, టపాకాయల వల్ల మూడు ప్రధాన కాలుష్యాలు ఏర్పడతాయి. అవి వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం మరియు భూమి-నీటి కాలుష్యాలు. మొదటిది *వాయు కాలుష్యం (ఎయిర్ పొల్యూషన్):* టపాసులు పేలినప్పుడు సల్ఫర్ డైయాక్సైడ్ (ఎస్.ఓ₂), నైట్రోజన్ ఆక్సైడ్స్ (ఎన్.ఓ₂), కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైయాక్సైడ్ (సి.ఓ₂) మరియు సూక్ష్మ కాలుష్య కణాలు (పీ.ఎం.2.5, పీ.ఎం.10) భారీగా విడుదలవుతాయి. ఈ విషపూరిత పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి, చిన్నారులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది. *రసాయనాలు (కెమికల్స్):* టపాసుల్లో బేరియం నైట్రేట్, లెడ్ (సీసం), అల్యూమినియం, పొటాషియం నైట్రేట్ వంటి లోహాలు, రసాయనాలను ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఒక ‘పాము బిళ్ల’ వెలువరించే పొగ దాదాపు 464 సిగరెట్ల పొగతో సమానమని పరిశోధనలు చెబుతున్నాయి. *శబ్ద కాలుష్యం (నోయిజ్ పొల్యూషన్ ):* భారతదేశంలో టపాసులకు చట్టబద్ధంగా గరిష్టంగా 125 డెసిబెల్స్ శబ్ద పరిమితి ఉంది. అయితే సాధారణ బాంబులు, పేలుళ్ల శబ్దం 120 డెసిబెల్స్ దాటిపోతుంది. ఇది చిన్న పిల్లలు, వృద్ధులు మరియు పెంపుడు జంతువులకు తీవ్రమైన చెవి సమస్యలు, ఒత్తిడిని కలిగిస్తుంది. *నేల మరియు నీటి కాలుష్యం:* టపాసుల అవశేషాల్లో ఉండే సీసం, బేరియం వంటి భార లోహాలు నేలలోకి, నీటిలోకి చేరి పర్యావరణాన్ని దెబ్బతీస్తాయి. *గ్రీన్ క్రాకర్స్ (గ్రీన్ క్రాకర్స్):* కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించడానికి సి.ఎస్.ఐ.ఆర్-ఎన్.ఈ.ఈ.ఆర్.ఐ.(నీరి) అభివృద్ధి చేసిన గ్రీన్ క్రాకర్స్ సాధారణ పటాకుల కంటే దాదాపు 30% తక్కువ పార్టిక్యులేట్ మేటర్ (పీఎం) మరియు తక్కువ కాలుష్య ఉద్గారాలను విడుదల చేస్తాయి.
*శబ్ద కాలుష్యం – మనుషులకే కాదు, మూగజీవాలకు కూడా నరకయాతన!
అధిక శబ్దంతో పేలే టపాసులు మనుషులలో వినికిడి సమస్యలు, మానసిక ఒత్తిడి, నిద్రాభంగం, గుండె సంబంధిత ఇబ్బందులకు కారణం కావచ్చు. అయితే మనం తరచుగా విస్మరిస్తున్న మరో ముఖ్యమైన అంశం వన్యప్రాణులు, పక్షులు, పెంపుడు జంతువులపై పడే ప్రభావం. పక్షులకు అకస్మాత్తుగా వినిపించే భారీ శబ్దాలు భయాందోళనలను కలిగించి, వాటి సహజ ప్రవర్తనను దెబ్బతీస్తాయి. గూళ్లలో ఉన్న పక్షులు, రాత్రిపూట సంచరించే గబ్బిలాలు, వీధి కుక్కలు, పిల్లులు వంటి జీవులు తీవ్ర భయానికి గురవుతాయి. జీవవైవిధ్యం (బయోడైవర్సిటీ) అంటే కేవలం అడవుల్లోని పెద్ద జంతువులే కాదు; మన చుట్టూ నివసించే ప్రతి చిన్న జీవి కూడా అందులో భాగమే.
*టపాసుల వ్యర్థాలు – నేల, నీరు, జీవావరణానికి మరో ముప్పు!*
టపాసులు పేలిన తరువాత మిగిలే కాగితాలు, ప్లాస్టిక్ ముక్కలు, రసాయన అవశేషాలు, లోహ సంబంధిత పదార్థాలు వీధులు, ఖాళీ ప్రదేశాలు, నీటి కాలువల్లో పేరుకుపోతాయి. వీటిని సరిగ్గా సేకరించి పారవేయకపోతే నేల, నీటి నాణ్యతపై ప్రతికూల ప్రభావాలు కలిగించవచ్చు. కొన్ని వ్యర్థాలను పక్షులు, జంతువులు ఆహారంగా పొరబడే ప్రమాదం కూడా ఉంది. పండుగ పూర్తయిన తరువాత మన పరిసరాలు చెత్తకుప్పలుగా మారడం అభివృద్ధి చెందిన సమాజానికి నిదర్శనం కాదు. పర్యావరణ పరిశుభ్రత (ఎన్విరాన్మెంటల్ హైజిన్), వ్యర్థాల నిర్వహణ (వేస్ట్ మేనేజ్మెంట్) కూడా పండుగ సంస్కృతిలో భాగం కావాలి.
*హరిత దీపావళి – సంప్రదాయాలకు ఆధునిక పర్యావరణ స్పృహ!*
హరిత దీపావళి అంటే పండుగను జరుపుకోకపోవడం కాదు; పర్యావరణానికి హాని తగ్గిస్తూ ఆనందాన్ని రెట్టింపు చేసుకోవడం. మట్టి ప్రమిదలు వెలిగించడం, సహజ నూనెలను ఉపయోగించడం, స్థానికంగా లభించే పూలతో అలంకరించుకోవడం, రంగురంగుల ముగ్గులు వేయడం, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషాలను పంచుకోవడం వంటి పద్ధతులను ప్రోత్సహించాలి. విద్యుత్ అలంకరణల్లో అవసరమైనంత మాత్రమే వినియోగించాలి. ప్లాస్టిక్ అలంకరణలు, ఒకసారి ఉపయోగించి పారేసే వస్తువులకు దూరంగా ఉండాలి. పండుగలలో స్థానిక చేతివృత్తిదారులు, కుమ్మరులు, చిన్న వ్యాపారులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పర్యావరణంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేయవచ్చు.
*పిల్లలకు పండుగల అసలైన అర్థాన్ని నేర్పించాలి!*
పిల్లలకు దీపావళి అంటే టపాసులు పేల్చడం, ఖరీదైన బహుమతులు కొనడం మాత్రమే అనే భావన కలగకుండా చూడాలి. దీపం వెలిగించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక భావనను, ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధాన్ని వివరించాలి. పాఠశాలలు, కళాశాలలు హరిత దీపావళి కార్యక్రమాలు నిర్వహించాలి. విద్యార్థులతో మొక్కలు నాటించడం, పక్షులకు నీటి పాత్రలు ఏర్పాటు చేయించడం, పర్యావరణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి చర్యలు చేపట్టాలి. పండుగల ద్వారా పిల్లల్లో పర్యావరణ నైతికత (ఎన్విరాన్మెంటల్ ఇతిక్స్), జీవుల పట్ల కరుణ (కంపషన్ ఫర్ ఆల్ లైఫ్), ప్రకృతి పట్ల బాధ్యత పెంపొందించాలి. ఈరోజు మనం పిల్లలకు నేర్పించే పండుగ సంస్కృతే రేపటి సమాజాన్ని నిర్మిస్తుంది.
*ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ప్రజల సమష్టి బాధ్యత!*
పర్యావరణ హితమైన దీపావళి కోసం ప్రభుత్వాలు, కాలుష్య నియంత్రణ మండళ్లు, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలి. కాలుష్య నియంత్రణ నిబంధనలను అమలు చేయాలి. అనుమతులు లేని, నిబంధనలకు విరుద్ధంగా తయారయ్యే టపాసుల విక్రయాలను అరికట్టాలి. ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించాలి. ఆసుపత్రులు, పాఠశాలలు, వృద్ధాశ్రమాలు, జంతు సంరక్షణ కేంద్రాల పరిసరాల్లో శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. పండుగ తరువాత వ్యర్థాలను సేకరించి శాస్త్రీయంగా నిర్వహించాలి. పర్యావరణ పరిరక్షణ అనేది ఒకరోజు కార్యక్రమం కాదు; నిరంతర సామాజిక బాధ్యత.
ఆనందానికి ప్రత్యామ్నాయాలు ఎన్నో – కాలుష్యానికి మాత్రం అవసరం లేదు!
దీపావళి సంబరాలను టపాసులు లేకుండానే అందంగా జరుపుకోవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి మట్టి దీపాలు వెలిగించడం, పేదలకు ఆహారం, వస్త్రాలు అందించడం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు సహకరించడం, పక్షులకు నీటి పాత్రలు ఏర్పాటు చేయడం, స్థానిక కళాకారుల నుంచి మట్టి ప్రమిదలు కొనుగోలు చేయడం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు పండుగకు కొత్త అర్థాన్ని ఇస్తాయి. మన ఆనందం మరొకరి ఆరోగ్యాన్ని దెబ్బతీయకుండా, మరొక జీవి మనుగడకు ముప్పు కలిగించకుండా ఉండాలి. నిజమైన పండుగ అంటే మనతో పాటు మన చుట్టూ ఉన్న సమాజం, ప్రకృతి కూడా సంతోషంగా ఉండేలా జరుపుకునేదే.
*పండుగలు మారాలి కాదు – పండుగలు జరుపుకునే మన ఆలోచనా విధానం మారాలి!*
మన పూర్వీకులు అందించిన సంప్రదాయాలను గౌరవించాలి. అదే సమయంలో నేటి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని, పర్యావరణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని వాటిని మరింత బాధ్యతాయుతంగా ఆచరించాలి. సంస్కృతి అంటే మూఢంగా పాత పద్ధతులను అనుసరించడం మాత్రమే కాదు; కాలానుగుణంగా మంచి మార్పులను స్వీకరించడం కూడా. మన పండుగలు ప్రకృతిని గౌరవించే జీవన తత్వాన్ని ప్రతిబింబించాలి. మన సంబరాలు గాలి, నీరు, నేల, అడవులు, పక్షులు, జంతువులు, మనుషుల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా ఉండాలి. పర్యావరణ స్పృహతో కూడిన పండుగలే భావితరాలకు మనం అందించగలిగే గొప్ప సాంస్కృతిక వారసత్వం.
ఈ దీపావళి మన నుంచి ప్రకృతికి ఒక వాగ్దానం కావాలి!
ఈ దీపావళి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక సంకల్పం తీసుకుందాం. మన ఇళ్లలో వెలిగించే దీపం మన ఆలోచనల్లోనూ పర్యావరణ స్పృహను వెలిగించాలి. మన ఆనందం గాలిలో కాలుష్యాన్ని, పరిసరాల్లో చెత్తను, జీవుల్లో భయాన్ని పెంచకూడదు. మనం జరుపుకునే పండుగలు భూమిపై ఉన్న సమస్త జీవరాశి మనుగడకు సహకరించాలి. ఎందుకంటే ఈ భూమి కేవలం మనుషులది మాత్రమే కాదు; చెట్లు, పక్షులు, జంతువులు, కీటకాలు, జలచరాలు సహా సమస్త జీవరాశికి సమానమైన ఆవాసం. మనం ప్రకృతిని కాపాడితేనే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ఈ దీపావళి నుంచి ఆడంబరాలకు బదులు ఆత్మీయతను, కాలుష్యానికి బదులు స్వచ్ఛతను, వినియోగానికి బదులు బాధ్యతను, విధ్వంసానికి బదులు జీవవైవిధ్య పరిరక్షణను ఎంచుకుందాం. “మన పండుగల వెలుగులు మనుషుల జీవితాల్లోనే కాదు, ప్రకృతిలోని ప్రతి జీవి జీవితంలోనూ వెలుగులు నింపాలి!”.
*మన నినాదం:*
సేఫ్ దివాళి – సేవ్ ఎన్విరాన్మెంట్!
*లైట్ లాంప్స్, నాట్ పొల్యూషన్!*
సెలెబ్రేట్ ఫెస్టివల్స్, నాట్ నోయిజ్ !
ప్రొటెక్ట్ ఎయిర్, వాటర్, సాయిల్ అండ్ బయోడైవర్సిటీ!
ప్రకృతిని ప్రేమిద్దాం – పండుగలను పర్యావరణ హితంగా జరుపుకుందాం, మన దేశ సంస్కృతిని కాపాడుకుందాం!
— రవిబాబు పిట్టల, పర్యావరణవేత్త, మాజీ సహాయ ఆచార్యులు, JNTUH, హైదరాబాద్ మరియు సంయుక్త కార్యదర్శి, ఓరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ (OWLS) NGO, తెలంగాణ. సెల్: +91 9849425271.


