= కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ప్రజలకు తప్పని కరెంటు కష్టాలు
= కోతలు లేవంటున్న సర్కార్.. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నం
= విద్యుత్ అంతరాయంతో వ్యాపారుల ఇబ్బందులు
= పంటల సాగుకూ తీవ్ర నష్టం
= ప్రభుత్వ కార్యాలయాల్లో నిలిచిపోతున్న కీలక పనులు
= ఫ్రీ కరెంట్ ఉన్నా లబ్ధిదారుల్లో ‘బిల్లు’ ఆందోళన
= వందల్లో రావాల్సిన బిల్లు.. వేలల్లో వస్తోందంటూ ఆవేదన
= ధర్పల్లి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. ఎస్సీ వాడలో అంధకారం
వేద న్యూస్, నిజామాబాద్ ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు సామాన్యుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఎన్నికల సమయంలో మార్పును కోరుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిన ప్రజలకు, ఇప్పుడు కరెంటు కోతలు కన్నీళ్లు మిగిలిస్తున్నాయి. ‘కాంగ్రెస్ రావాలి.. అభివృద్ధి జరగాలి’ అని ఆశించిన జనాలే, ఇప్పుడు ‘కాంగ్రెస్ వచ్చింది.. కరెంటు పోయింది’ అంటూ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. గత ప్రభుత్వ గర్వాన్ని అణచివేసి అధికారమిచ్చిన ప్రజలకు, ఇప్పుడు కరెంటు అంతరాయాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
అంతరాయం లేదంటున్న ప్రభుత్వం..
ఒకవైపు సీఎం విద్యుత్ కోతలు లేవని, ప్రతిపక్షాలు కావాలనే బురదజల్లుతున్నాయని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ముఖ్యంగా రోజువారీ ఆదాయంపై ఆధారపడే చిన్నపాటి వ్యాపారస్తులు కరెంటు లేక తీవ్రంగా నష్టపోతున్నారు. షాపుల్లో కరెంటు లేకపోవడంతో వ్యాపారాలు సాగక, కుటుంబాలను పోషించుకోలేక రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని వారు వాపోతున్నారు. అటు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా విద్యుత్ అంతరాయం కారణంగా పనులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సాగుకు తప్పని తిప్పలు
వ్యవసాయ రంగంపై కూడా ఈ విద్యుత్ సంక్షోభం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎంతో ఆశతో వరి పంట సాగు చేసిన రైతులు, సమయానికి కరెంటు లేక నీరు అందక కన్నీళ్లు పెడుతున్నారు. పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా అందించాలని రాష్ట్ర రైతాంగం డిమాండ్ చేస్తోంది. విద్యుత్ కష్టాలు కేవలం నగరాలకే పరిమితం కాకుండా పల్లెల్లోనూ రైతు గొంతు కోస్తున్నాయని ఆవేదన వ్యక్తమవుతోంది.
జీరో బిల్లుల పేరుతో మోత?
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘గృహ జ్యోతి’ పథకంపై గ్రామాల్లో వింత చర్చలు సాగుతున్నాయి. ఒక మీటర్ పై జీరో బిల్లు ఇస్తూనే, మరో మీటర్ పై విద్యుత్ బిల్లుల మోత మోగిస్తున్నారని ధర్పల్లి వంటి గ్రామాల్లో ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. సాధారణంగా ప్రతి నెలా 150 నుంచి 200 రూపాయల వరకు వచ్చే బిల్లు, ఇప్పుడు అకస్మాత్తుగా 500 నుంచి 1500 రూపాయల పైచిలుకు రావడం పేద ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. రెక్కాడితే గానీ డొక్కాడని కూలీలు, తాము కష్టపడిన సొమ్మంతా కరెంటు బిల్లులకే సరిపోతోందని వాపోతున్నారు.
ధర్పల్లి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. ఎస్సీ వాడలో అంధకారం
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ఎస్సీ వాడలో విద్యుత్ సమస్యలు అత్యంత దయనీయంగా మారాయి. ముఖ్యంగా లోవోల్టేజ్ సమస్య కారణంగా ఇళ్లలో ఫ్యాన్లు తిరగక, ఉక్కపోత, దోమల కాటుతో జనం రాత్రంతా జాగారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించడానికి కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేస్తానని ఏఈ హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు అడిగినందుకు కక్ష సాధింపుగా, కనీస నోటీసులు ఇవ్వకుండా అధికారులు కనెక్షన్లు కట్ చేస్తున్నారని, సమస్య తీరిన తర్వాతే బకాయిలు చెల్లిస్తామని బాధితులు భీష్మించుకున్నారు. మరోవైపు, ముదిరాజ్ గల్లీ వంటి ప్రాంతాల్లో రాత్రివేళల్లో విధిస్తున్న అక్రమ కోతలు దొంగతనాలకు దారితీస్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం బిల్లుల వసూలుపైనే శ్రద్ధ చూపిస్తూ, అదనపు వసూళ్లకు పాల్పడుతున్న ధర్పల్లి విద్యుత్ అధికారుల తీరుపై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.