వేద న్యూస్,రాజన్న సిరిసిల్ల:

రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ ఈ సీ) నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు(ఆర్ ఓ) లకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు వివిధ అంశాలపై సోమవారం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రవి కుమార్ తో కలిసి శిక్షణ ఇచ్చారు. పీపీటీ ప్రదర్శన ఇచ్చి ప్రతి అంశంపై వివరించారు.ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ఎస్ఈసీ ఆదేశాల ప్రకారం విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రతి ఆర్ ఓ తమ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలని, విద్యుత్ సరఫరా, నీటి వసతి తదితర సదుపాయాలు తనిఖీ చేయాలని, సంబంధిత ఎంపీడీఓలు, అధికారులతో ఆ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇంక ఇతర సామగ్రి సరిచూసుకోనేలా పీఓ లు, ఇతర పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన వాహనాల్లోనే ఎన్నికల సామగ్రి తరలించాలని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆర్ ఓలకు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు.శిక్షణలో డీఆర్డీఓ శేషాద్రి, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీపీఓ షరీఫుద్దిన్, నోడల్ అధికారి భారతి, ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.