వేద న్యూస్, డెస్క్ :

సాధారణంగా రాజకీయాలు అంటేనే డబ్బు, బలం, అంగబలం ఉన్నవారికి మాత్రమే సాధ్యమనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థలో నిజమైన ప్రజా ప్రతినిధి అంటే ప్రజల నుంచి వచ్చిన సామాన్యుడే అని నిరూపించారు పశ్చిమ బెంగాల్‌కు చెందిన కలిత మాఝీ. ఒకప్పుడు ఇళ్లల్లో గిన్నెలు కడుగుతూ, ఊడుస్తూ నెలకు కేవలం రూ. 4,000 సంపాదించే స్థాయి నుండి నేడు ఏకంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆమె సాగించిన ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

రూ. 4,000 జీతం నుండి అసెంబ్లీ వరకు

పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా బర్ధమాన్ జిల్లా గుస్కరా మున్సిపాలిటీ పరిధిలోని మాజ్‌పుకూర్ పారాకు చెందిన 37 ఏళ్ల కలిత మాఝీ సుదీర్ఘ కాలం పాటు సాధారణ గృహ కార్మికురాలిగా (Domestic Helper) పనిచేశారు. ఇళ్లల్లో పనులు చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేవారు. ఆమె భర్త సుబ్రతా మాఝీ ఒక ప్లంబర్‌గా పనిచేస్తున్నారు. ఒక పక్క పేదరికం వేధిస్తున్నప్పటికీ, సమాజంలో మార్పు తీసుకురావాలనే తపనతో ఆమె గత 10 ఏళ్లుగా క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

బీజేపీ తరపున చారిత్రాత్మక విజయం

ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) ఆమె ప్రతిభను గుర్తించి ఔస్‌గ్రామ్ (Ausgram) ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం కల్పించింది. ప్రచారంలో నిరాడంబరంగా వ్యవహరిస్తూ, ప్రజలతో మమేకమైన కలిత.. తన సమీప ప్రత్యర్థి అయిన తృణమూల్ కాంగ్రెస్ (TMC) అభ్యర్థిపై ఏకంగా 12,535 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు.సొంత నియోజకవర్గంలో 1,07,692 ఓట్లు సాధించిన ఆమె, విజయం తర్వాత కూడా ఎంతో నిగర్విగా ఉండటం విశేషం. గెలిచిన మరుసటి రోజు కూడా ఆమె తన దైనందిన గృహ పనులను యధావిధిగా చేసుకోవడం ఆమె సాధారణ జీవనశైలికి అద్దం పడుతోంది.

మంత్రిగా ప్రమాణ స్వీకారం.

ప్రజల కోసం సరికొత్త లక్ష్యాలుగతంలో కేవలం ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించిన కలిత మాఝీని, తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో భాగంగా పశ్చిమ బెంగాల్ సహాయ మంత్రి (Minister of State) గా నియమించారు. నిన్న ఆమె మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన ప్రాధాన్యతలను స్పష్టం చేశారు.

తాగునీటి సరఫరా:-గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చేయడం

వెనుకబడిన వర్గాల సంక్షేమం: పేదలు, వెనుకబడిన తరగతుల ప్రజల ఆర్థిక మరియు సామాజికాభివృద్ధికి కృషి చేయడం.

మహిళల భద్రత: జంగల్ మహల్ లాంటి అటవీ ప్రాంతాలలో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే బాలికలు మరియు మహిళల రక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం.

వైద్య సదుపాయాలు: గుస్కరా ప్రాంతంలో ఒక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి, అలాగే ఫైర్ స్టేషన్ల ఏర్పాటు కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *