Mohammad Azharuddin

మైనారిటీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మైనారిటీ సంక్షేమ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ తెలిపారు. విద్య, సామాజిక, ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని శాసనమండలిలో వెల్లడించారు.మైనారిటీ సంక్షేమ పథకాలకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు, నిధుల విడుదల, వ్యయంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను సభకు లిఖితపూర్వకంగా అందజేసినట్లు తెలిపారు.

2024–25లో రూ.2,256 కోట్ల కేటాయింపు

2024–25 ఆర్థిక సంవత్సరంలో మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం రూ.2,256 కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు. ఇందులో రూ.2,122.74 కోట్లు విడుదల కాగా.. విడుదలైన నిధుల్లో రూ.961.54 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.అదేవిధంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.2,844 కోట్లు కేటాయించగా.. రూ.2,317.65 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు రూ.1,010.63 కోట్లను ఖర్చు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

జనాభా శాతమే ప్రాతిపదిక కాదు

2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ మొత్తం జనాభాలో మైనారిటీల వాటా 14.27 శాతంగా ఉందని మహమ్మద్ అజారుద్దీన్ తెలిపారు.అయితే కేవలం జనాభా శాతాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని మైనారిటీ సంక్షేమ నిధులను కేటాయించడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న నిధులు, మైనారిటీల అవసరాలు, సంక్షేమ పథకాల అమలు, వాటి పరిధి వంటి అంశాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకుని పథకం వారీగా నిధులు కేటాయిస్తున్నట్లు వివరించారు.

2026–27లో రూ.2,893.26 కోట్ల కేటాయింపు

2026–27 ఆర్థిక సంవత్సరానికి మైనారిటీ సంక్షేమ పథకాల కోసం రూ.2,893.26 కోట్లను కేటాయించినట్లు మంత్రి తెలిపారు.
మైనారిటీ సంక్షేమానికి రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా పథకాల బడ్జెట్‌ను కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు.పెంచిన బడ్జెట్ కేటాయింపులతో మైనారిటీలకు విద్యా అవకాశాలు, సామాజిక భద్రత, ఆర్థిక సాధికారతతో పాటు సంక్షేమ పథకాలను మరింత విస్తృతంగా అందించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. కేటాయించిన నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ మైనారిటీ వర్గాల విద్యా, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మహమ్మద్ అజారుద్దీన్ శాసనమండలికి హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *